అమెరికాలో ఆకాశాన్నంటిన ధరలు.. జనం బతుకు బండి లాగలేక విలవిల

  • అమెరికాలో నిత్యావసరాల ధరలతో ప్రజల తీవ్ర ఇబ్బందులు
  • కొత్త టారిఫ్‌లు, యుద్ధంతో పెరిగిన ఇంధన ధరలే ప్రధాన కారణం
  • ఖర్చులు పెరిగి ఆహారం కూడా తగ్గించుకుంటున్న సామాన్యులు
  • కుటుంబాలపై ఏటా 1200 డాల‌ర్ల‌ అదనపు భారం పడొచ్చన్న నిపుణులు
  • ధరల పెరుగుదల కొనసాగితే వడ్డీ రేట్లు తగ్గవన్న ఫెడరల్ రిజర్వ్
అమెరికాలో సామాన్య ప్రజలు నిత్యావసరాల ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిరాణా సరుకులు, గ్యాసోలిన్ (పెట్రోల్), విద్యుత్ వంటి యుటిలిటీ బిల్లుల ధరలు ఆకాశాన్నంటడంతో వారి జీవనం కష్టతరంగా మారింది. అమెరికా ప్రభుత్వం కొత్తగా విధించిన టారిఫ్‌లు, మరోవైపు ప‌శ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు.. ఈ రెండు అంశాలు కలిసి సామాన్యుడిపై పెను భారం మోపుతున్నాయని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితి ఆర్థిక వృద్ధికి సైతం గండికొట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ ధరల పెరుగుదల ప్రభావం తమపై ఎలా ఉందో కొందరు అమెరికన్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీతో పంచుకున్నారు. "నమ్మకద్రోహంగా అనిపిస్తోంది. మా జీవితాలు బాగు చేస్తారని ట్రంప్‌కు ఓటేశాను" అని కాలిఫోర్నియాకు చెందిన 66 ఏళ్ల కేటీ పెయ్రే ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనంతో పనిచేస్తున్న ఆమె, తన మనవడితో కలిసి జీవిస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి రాకముందు తన నెలవారీ ఖర్చులు 2,300 డాల‌ర్లు (రూ. 2,16,704) ఉండేవని, ఇప్పుడు అవి 2,500 డాల‌ర్లు (రూ. 2,35,548) దాటాయని, దీంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని ఆమె వాపోయారు.

లాస్ ఏంజెలెస్‌కు చెందిన 34 ఏళ్ల క్రిస్టియన్ డెవిటో కూడా ఇదే రకమైన ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు నెలల్లో తన నెలవారీ బిల్లులు 15 శాతం పెరిగాయని తెలిపారు. "ప్రయాణ ఖర్చులు వారానికి 50 నుంచి 70 డాల‌ర్ల‌కి పెరిగాయి. ఇప్పుడు ఆహారం కూడా తగ్గించుకోవాల్సి వస్తోంది" అని ఆయన అన్నారు. ప్రభుత్వ గణాంకాలు కూడా ఈ ఆందోళనలను బలపరుస్తున్నాయి. యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం మార్చిలో ఇంధన ధరలు 10.9% పెరగ్గా, గ్యాసోలిన్ ధరలు ఏకంగా 21.2% పెరిగాయి.

టారిఫ్‌ల వల్ల వినియోగదారులపై పడే భారం దాదాపు సమానంగా ఉంటుందని ఫెడరల్ రిజర్వ్ పరిశోధనలో తేలింది. పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అంచనా ప్రకారం కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతులపై విధించిన టారిఫ్‌ల వల్ల సగటు అమెరికన్ కుటుంబంపై ఏటా 1200 డాల‌ర్ల (రూ. 1,13,063) అదనపు భారం పడుతుంది. ధరల ఒత్తిడి కొనసాగితే, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధికంగానే ఉంచుతామని ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఇది క్రెడిట్ కార్డులు, ఆటో లోన్‌లపై భారాన్ని మరింత పెంచుతుంది. "త్వరలోనే మంచి వార్త వస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరో ఏడాదిని మేము తట్టుకోలేము" అని కేటీ పెయ్రే తన నిస్సహాయతను వ్యక్తం చేశారు.

US Inflation
United States
Inflation
Gas prices
Cost of living
Federal Reserve
Consumer prices
Economy
Tariffs
Global Economy

More Telugu News